హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డు ద్వారా అందే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
సరికొత్తగా రేషన్ కార్డులు..
లామినేటెడ్ (పీవీసీ) రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులను అందించనున్నారు. వాటర్‌ప్రూఫ్, క్రెడిట్ కార్డు పరిమాణంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ ‘స్మార్ట్’ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో (QR Code) పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు. అయితే, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాల ధృవీకరణను (e-KYC) త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. లబ్ధిదారులు సులభంగా కార్డులు పొందేలా ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
లబ్ధిదారుల తుది జాబితాల సిద్ధం, కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయనున్నారు.
ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమం సంక్షేమ పాలనలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
గుడ్ న్యూస్.. ఇక సరికొత్తగా రేషన్ కార్డులు.. పంపిణీ ఎప్పటినుంచో తెలుసా..?

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 1.05 కోట్ల లామినేటెడ్ (పీవీసీ) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు. క్యూఆర్ కోడ్, ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించిన ఈ కార్డులు వాటర్‌ప్రూఫ్‌గా ఉండటంతో పాటు సులభంగా వినియోగించుకునేలా రూపొందించారు.
