తొలి అడుగు డైలీ

ప్రతి వార్తలో తొలి అడుగు

బోనాల సందడి.. హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు! ఈ రూట్లలో ప్రయాణించేవారు తెలుసుకోండి

Administrator · 09 Aug 2026, 02:52 PM · తెలంగాణ

బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. లాల్ దర్వాజా, దర్బార్ మైసమ్మ, కార్వాన్, అంబర్‌పేట్ మహంకాళి ఆలయాల వద్ద వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు. పాతబస్తీలో ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు ప్రత్యేక ఆంక్షలు విధించారు.

బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. లాల్ దర్వాజా బోనాలు, దర్బార్ మైసమ్మ బోనాలు, కార్వాన్ బోనాల సందర్భంగా పాతబస్తీతో పాటు అంబర్‌పేట్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు, సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఇంజిన్ బౌలి, ఫలక్‌నుమా నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను కొత్త షంషేర్‌గంజ్ ‘టీ’ జంక్షన్ వద్ద గోశాల, తాడ్‌బన్ లేదా గోశాల–మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి ఆలియాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్‌బన్ లేదా ఖిల్వత్ వైపు మళ్లించనున్నారు.

నాగుల్‌చింత, సుధా టాకీస్ నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్, గౌలీపురా మీదుగా అనుమతిస్తారు. గౌలీపురా నుంచి లాల్ దర్వాజా మోడ్ వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మీర్‌చౌక్ వైపు మళ్లిస్తారు. చార్మినార్ నుంచి నాగుల్‌చింత వైపు వెళ్లే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్రీగంజ్ మార్గంలో అనుమతించనున్నారు.

రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను వెంకటేశ్వరస్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజ్ వైపు మళ్లిస్తారు. కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనాలను ఓపీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ ‘వై’ జంక్షన్ వద్ద గౌలీపురా వైపు పంపుతారు. బాలాగంజ్ నుంచి వచ్చే వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టాచ్యూ, నాగుల్‌చింత జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఉప్పుగూడ, ఛత్రినాక నుంచి గౌలీపురా మీదుగా వచ్చే వాహనాలను బాలరాజ్ జ్యువెలర్స్ గౌలీపురా ఎక్స్‌రోడ్స్ వద్ద మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ వైపు మళ్లించనున్నారు. పాత చంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక వైపు వచ్చే భారీ వాహనాలను సంతోష్‌నగర్, చంద్రాయణగుట్ట వైపు అనుమతిస్తారు.
https://www.toliadugudaily.com/article/post-20260809145419